పాకిస్తాన్ సోషల్ మీడియాలో మహిళల ఆందోళన... స్త్రీవాదంపై సదస్సులో అంతా మగవాళ్ళేనా అంటూ ఆగ్రహం...
పురుషాధిక్యం ఎక్కువగా ఉండే పాకిస్తాన్‌లో స్త్రీవాదంపై ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమానికి ఒక్క మహిళా అతిథినీ ఆహ్వానించకపోవడంపై సోషల్ మీడియాలో నిరసనలు హోరెత్తాయి. దీంతో నిర్వాహకులు వెనక్కి తగ్గి, కార్యక్రమానికి ఇద్దరు మహిళా అథితులను ఆహ్వానించారు. చర్చ పేరు కూడా మార్చారు.
పాకిస్తాన్ కళల మండలి (ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ పాకిస్తాన్) శుక్రవారం కరాచీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి తొలుత పెట్టిన 'ఫెమినిజం: ది అదర్ పర్‌స్పెక్టివ్' అనే పేరు మీద కూడా విమర్శలు వచ్చాయి. దీనిని 'అండర్‌స్టాండింగ్ ఫెమినిజం' అని మార్చారు.
ప్రధాన మీడియా సంస్థల్లో నిర్ణయాలు తీసుకొనే హోదాల్లో ఉన్న వారు, ఫాలోయింగ్ ఉన్న మగవారు స్త్రీవాదంపై ఆలోచనలను పంచుకొనేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నామని నిర్వాహకులు చెప్పారు. అయితే, ఆ ఆలోచననే చాలా మంది విమర్శకులు ప్రశ్నించారు.
మొదట అనుకున్నదాని ప్రకారమైతే ఈ చర్చలో 'హోస్ట్' ఉజ్మా అల్-కరీమ్ ఒక్కరే మహిళ. కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పత్రాల్లో ఆమె పేరు చివర్లో ఉంది.
ఈ చర్యపై సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాక స్త్రీవాది మెహ్తాబ్ అక్బర్ రష్దీ, జర్నలిస్ట్ ఖ్వత్రీనా హొసైన్‌లను మహిళా స్పీకర్లుగా నిర్వాహకులు కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రచార పత్రాల్లో మార్పు చేసి, హోస్ట్ ఉజ్మా అల్-కరీమ్ పేరు ప్రముఖంగా కనిపించేలా రాశారు.
ఈ మార్పులతో అందరూ శాంతించలేదు. మహిళా అతిథులెవరూ లేకుండా నిర్వహించే చర్చలో పాల్గొనడానికి ఆయా పురుషులు ఎలా అంగీకరించారనే ప్రశ్నలు వచ్చాయి. సొంత ప్రయోజనాల కోసం వారు స్త్రీవాదాన్ని ఉపయోగించుకోవాలనుకొన్నారనే ఆరోపణలూ వచ్చాయి.