సీఆర్డీయే అధికారిణి గ్లోరియా సస్పెన్షన్ రద్దు!
- అభియోగాలపై ఆమె వివరణతో ప్రభుత్వం సంతృప్తి
అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): రాజధాని కోసం అమలు చేసిన భూసమీకరణ పథకంలో అవకతవకలకు పాల్పడడం ద్వారా అర్హులైన రైతులకు అన్యాయం చేశారన్న ఆరోపణలపై సస్పెండైన అప్పటి ఏపీసీఆర్డీయేలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.గ్లోరియా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది! విధినిర్వహణలో గ్లోరియా ఉద్దేశపూర్వకమైన అలక్ష్యాన్ని ప్రదర్శించారని, అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించే సాక్ష్యాధారాలన్నీ విచారణలో లభ్యమైనందున ఈ ఏడాది అక్టోబరులో గ్లోరియాను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించిన ప్రభుత్వం... కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం గమనార్హం! 'నేనెన్నడూ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏపీసీఆర్డీయే నియమ నిబంధనలను ఉల్లంఘించలేదు. నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదు. తద్వారా నా చర్యల వల్ల ప్రభుత్వానికి ఏమాత్రమూ నష్టం వాటిల్లలేదు' అంటూ గ్లోరియా ఇచ్చిన వివరణతో సంతృప్తి చెంది, ఆమె సస్పెన్షన్‌ను రద్దు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి వి.ఉషారాణి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు!
ఇదీ నేపథ్యం..!
రెవెన్యూ శాఖ నుంచి సీఆర్డీయేకు డిప్యుటేషన్‌పై వచ్చిన పి.గ్లోరియా కొంతకాలం క్రితం వరకూ రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు లోకల్ కాంపిటెంట్ అథారిటీగా వ్యవహరించారు. ఆ సమయంలో నేలపాడు పరిధిలో కొందరు అస్సైన్డ్ రైతులు ల్యాండ్ పూలింగ్ పథకం కింద అమరావతి కోసం అందజేసిన భూములకు బదులుగా వారికి కేటాయించాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను వారికి కాకుండా కొందరు అనర్హులకు కట్టబెట్టారంటూ గ్లోరియాపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై తాము ఫిర్యాదులు చేసినప్పటికీ ఆమెగానీ, సీఆర్డీయే ల్యాండ్స్ విభాగానికి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న చెన్నకేశవరావుగానీ స్పందించలేదని పేర్కొంటూ బాధిత రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వీటిపై అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) మాజీ ఈడీ బి.రామయ్యతో ప్రభుత్వం విచారణ జరిపించగా, వారిద్దరిపై వచ్చిన అభియోగాలు వాస్తవమేనని పేర్కొంటూ ఆయన నివేదిక సమర్పించారు. దీంతో ఈ ఏడాది అక్టోబరులో గ్లోరియాను విఽధుల నుంచి సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు... వివరణ ఇవ్వాల్సిందిగా చెన్నకేశవరావు(ఈ మధ్యనే రిటైర్ అయ్యారు)ను ఆదేశించారు.