న్యూఢిల్లీ: ఆర్మీలో కమాండ్ పాత్రలో మహిళా అధికారులు బాధ్యతలు నిర్వర్తించవచ్చని పేర్కొంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్‌పై వాదనల సందర్భంగా సుప్రీం ఇవాళ చారిత్రక తీర్పును ప్రకటించింది. విచారణ సందర్భంగా పర్మినెంట్ కమిషన్‌పై కేంద్రం తన స్పందనను తెలియజేసింది. మహిళా అధికారులను అంగీకరించడానికి సైన్యంలోని పురుషులు సంసిద్ధంగా లేరు. యుద్ధ ఖైదీలుగా తీసుకునే ప్రమాదం ఉంది. సైన్యంలోని పురుషుల్లో ఎక్కువమంది మహిళా అధికారులను కమాండోగా అంగీకరించడానికి మానసికంగా సిద్ధంగాలేరు. అదేవిధంగా వివిధ శారీరక ప్రమాణాల ఆధారంగా పోస్టింగ్ విషయంలో స్త్రీ, పురుషులను సమానంగా చూడలేమంది. ఈ విషయంలో పరిమితులున్నాయని పేర్కొంటూ ఆర్మీ కమాండో పోస్టులకు మహిళలు తగినవారు కాదని వివరించింది. వాదనల అనంతరం సుప్రీం తీర్పును నేడు వెల్లడిస్తూ.. ఆర్మీలోని మహిళ అధికారులు కమాండింగ్ పదవులకు అర్హులేనని పేర్కొంది. పురుష అధికారులతో సమానంగా కమాండింగ్ స్థానాలను మహిళా అధికారులు పొందవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్పులను మూడు నెలల్లో అమలు పరచాలని ఆదేశించింది. ప్రభుత్వ వాదనలు వివక్షాపూరితంగా, కలతపెట్టేవిగా అంతేకాకుండా ఓ మూస ధోరణిలో ఉన్నాయంది. స్త్రీ, పురుషుల మధ్య ఆర్మీ వివక్ష చూపించొద్దని సుప్రీం పేర్కొంది.
ఆర్మీ కమాండ్ బాధ్యతల్లో మహిళా అధికారులు: సుప్రీం