జిల్లాకు కరోనా లేదు

జిల్లాలో ఇంత వరకు కరోనా వైరస్‌ కేసులు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా ప్రభుత్వ దవాఖానలో దీని గురించి ఐసోలేషన్‌ వార్డు పని చేస్తున్నదని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో బుధవారం కరోనా వైరస్‌, పల్లెప్రగతి, పట్టణ ప్రగతిపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇందల్వాయి మం డలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో బాలరాజు అలియాస్‌ రాజయ్య అనే వ్యక్తికి వైరస్‌ సోకినట్లు వార్త లు రావడంతో వెంటనే అతనిని హైదరాబాద్‌లో ని గాంధీ దవాఖానకు పంపించి పరీక్షలు చేయించామన్నారు. ఆయనకు ఈ వైరస్‌ లేనట్ల్లు నిర్ధారణ అయిందని తెలిపారు. అతన్ని బుధవారం సాయంత్రం డిశ్చార్జ్‌ చేశారని తెలిపారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదని, ఇది రావడానికి అవకాశాలు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉన్నాయన్నారు. అందుకు కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇది మన దరిచేరదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావద్దని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఒక ఐసోలేషన్‌ వార్డు వేరు గా ఏర్పాటు చేశామని, అందులో సిబ్బందితో పాటు అన్ని ఇతర సదుపాయాలు సిద్ధం చేశామన్నారు. ఇంకా ఏ అవసరం వచ్చినా ఏర్పాట్లు చేస్తామన్నారు.